రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో కీలక నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఫిబ్రవరి 25న నమోదైన ఈ కేసులో పట్టుబడ్డవారికి డ్రగ్స్ సరఫరా చేసిన వారిలో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు కేసుల్లో దాదాపు మూడేళ్లుగా పరారీలో ఉన్న సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్‌ను, అతడి అనుచరుడు నరేంద్ర శివనాథ్‌లను గచ్చిబౌలి, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.కోటి విలువైన కారు, 11 గ్రాముల ఎండీఎంఏ, ఏడు ఫోన్లు సీజ్ చేశారు.
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించి మంజీరా గ్రూపు డైరెక్టర్ గజ్జల వివేకానంద్(37)కు.. ఆ గ్రూపు సంస్థల మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలిందని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతణ్ని అరెస్టు చేసి విచారించగా అత్తాపూర్‌లోని కేఫ్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేసే మీర్జా వహీద్ బేగ్ ద్వారా వచ్చినట్లు తేలిందని చెప్పారు. మీర్జా వహీద్‌ను విచారిస్తే ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ లింకు బయటపడటంతో మంగళవారం సాయంత్రం రెహ్మాన్, శివనాథ్‌లను పట్టుకున్నట్లు వెల్లడించారు.