నేల స్వభావాన్ని పరీక్షించాకే కాళేశ్వరం బ్యారేజీలు నిర్మించారా? : NDSA కమిటీ

-

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల బృందం తాజాగా మరోసారి హైదరాబాద్కు వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) మురళీధర్‌, ప్రస్తుత ఈఎన్సీ అనిల్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఓ అండ్‌ ఎం) నాగేందర్‌రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, గతంలో డిజైన్స్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేసిన నరేందర్‌రెడ్డి, ‘కాడా’ చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌తో పాటు హైడ్రాలజీ, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) ఇంజినీర్లతో సమావేశం అయింది.

ఈ సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఏ కారణాలతో మార్చాల్చి వచ్చిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకొన్న ఇంజినీర్లను ప్రశ్నించింది. అసలు డిజైన్‌ చేసింది బ్యారేజీకా లేక డ్యామ్‌కా అని ప్రశ్నించినట్లు సమాచారం. డీపీఆర్‌లో ఏముందో చూసి చెప్పాలని కోరిన కమిటీ, ఒరిజినల్‌గా షీట్‌ పైల్స్‌ ఉండగా సీకెంట్‌ పైల్స్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? దీనివల్ల వైఫల్యాలు ఏమైనా కనిపించాయా? అని అడిగారు. బ్యారేజీని ఫ్లోటింగ్‌ కింద డిజైన్‌ చేసి రిజిడ్‌ కింద ఎందుకు మార్చారని ఆరా తీసినట్లు తెలిసింది. ఇక ఇవాళ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లతో చర్చించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news