మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. దీంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులతో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అటు ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరకు సాగనున్న ర్యాలీలో పాల్గొనున్నారు మంత్రి మల్లారెడ్డి. మర్రి రాజశేఖర్ రెడ్డి.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు అన్న సంగతి తెలిసిందే.

కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాకు రంగం సిద్ధమైంది. తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే తాజాగా మల్కాజిగిరి, జనగాం, నర్సాపూర్, గోషామహల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.
మల్కాజిగిరి స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇక్కడి అభ్యర్థిగా ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావును ప్రకటించగా.. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో నిలపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.