అనునిత్యం వెంటాడి తనను ఓడించాలని చూసి గెలవాలనే పట్టుదలను మరింత పెంచి చివరకు తన గెలుపునకు పరోక్షంగా సహకరించిన బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కు మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. మెదక్ స్థానంలో బీజేపీ గెలవకూడదని హరీశ్ రావు ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. అయినా.. బీఆర్ఎస్ పుట్టిన మెదక్ గడ్డపై ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ గెలుపులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన హరీశ్ రావుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలువలేక పోయిందన్నారు. దేశంలో ఎన్టీఏ కూటమి విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.
తమ గెలుపుకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తను మెదక్ సీటు గెలవడానికి సహకరించిన పెద్దలందరకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రఘునందన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.