భారీ వర్షాల వల్ల ప్రయాణికులకు మెట్రో సేవల్లో అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాని సిబ్బంది, అధికారులకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. వర్షాకాలంలో మెట్రో రాకపోకలు, జాగ్రత్త చర్యలపై మెట్రో రైలు భవన్లో ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సహా ఇతర అధికారుల సమీక్ష నిర్వహించారు. వానా కాలంలో రైలు సేవలను నిరంతరాయంగా నడపాలని, ప్రయాణికుల భద్రతపై సీనియర్ ఇంజినీర్లందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల మెట్రో రైలు ట్రాన్స్ కో ఫీడర్లు ట్రిప్ అయితే తక్షణమే ప్రత్యామ్నాయంగా ఫీడర్లను మార్చడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు విస్తరణ జాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, పైపులను శుభ్రపర్చాలని, కంప్రెస్డ్ ఏయిర్ తో వయాడక్ట్ లను శుభ్రం చేయాలని తెలిపారు. వర్షం వల్ల ప్లాట్ ఫామ్ లపై నీరు నిలిచిపోకుండా నిరోధించడానికి అదనపు హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించుకోవాలని కోరారు. మెట్రో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, లిప్ట్ లు, ఎస్కలేటర్ల వద్ద వర్షపు నీరు నిలువకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.