బతుకమ్మ చీరలను కాల్చేస్తే కఠిన చర్యలు : ఎర్రబెల్లి

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. కొన్నిచోట్ల మహిళలు చీరలు నాణ్యంగా లేవని వాటిని కాల్చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పెద్దన్నలా.. తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని.. కానీ కొందరు దాన్ని కూడా రాజకీయం చేసి చీరలను కాల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నుంచి బతుకమ్మ చీరలను ఎవరైనా కాల్చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని  పోలీసు అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలు బహుమతిగా ఇస్తున్నామని వాటిని ధరతో పోల్చకూడదని ఆయన సూచించారు.

“కేసీఆర్​ ప్రతి అక్కచెల్లమ్మలకు ఒక అన్నగా, తమ్ముడుగా ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు ఇస్తున్నారు. లేనిపోని రాజకీయం చేసి వాటిని కాల్చే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. బతుకమ్మ చీరలు ఇష్టం లేని వాళ్లు తీసుకోకండి. అలాగే వారి ఇంట్లో తీసుకుంటున్న పింఛన్లు, రైతుబంధు మిగతా ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోకండి.”- ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయితీ రాజ్​ శాఖ మంత్రి.