ఉచిత విద్యుత్ పథకం… ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

తెలంగాణలోని సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఈ పథకానికి సంబంధించి తుది విధివిధానాలపై చర్చించడానికి మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యుత్ సంస్థల సీఎండి రఘుమారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కుల సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ అర్హులైన అందరు రజకులకు, నాయీ బ్రాహ్మణులకు లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ పథకంలో కుల వృత్తిదారులను ఇబ్బంది పెట్టేలా ఎలాంటి నిబంధనలు చేర్చబోమని స్పష్టం చేసారు. కుల వృత్తిదారులు ఓనర్లుగా ఉన్న లాండ్రీలు, సెలూన్లకు మాత్రమే ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. పాత మీటర్లకే పథకం అమలు చేస్తామని, ఒకవేళ పాత మీటర్లు లేకుంటే ప్రభుత్వమే ఉచితంగా మీటర్లు అందిస్తుందని అన్నారు.

కుల వృత్తిదారుల వద్ద లైసెన్సులు, లీజు అగ్రిమెంట్లు లేకున్నా కూడా ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, దళారులు, మధ్యవర్తులకు ఎలాంటి అస్కారం లేకుండా ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకూ కేవలం రజకుల నుంచి 200, నాయీబ్రాహ్మణుల నుంచి 400 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. ఎలాంటి ఆందోళనలు లేకుండా రజక, నాయీబ్రాహ్మణులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు.ఇక అనర్హులను అడ్డుకొని పథకం పక్కదారి పట్టుకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుల సంఘాలు తీసుకోవాలని మంత్రి కోరారు.