తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను తెలంగాణ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జులైలో జరగాల్సి ఉండేవి. అయితే పరీక్షలు నిర్వహించాలా? రద్దు చేయాలా ? అనే దానిపై నివేదిక పంపించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. రెగ్యులర్ 10th,ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షలు రద్దు చేయాలని రిపోర్ట్ ఇచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్. దీంతో ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది సర్కార్.
గతేడాది కూడా రద్దు అయిన పరీక్షలు.. మినిమం పాస్ మార్క్స్ వేసి అందరిని ఉత్తీర్ణులను చేసింది ప్రభుత్వం. ఇక ఈ ఏడాది అడ్మిషన్స్, పరీక్ష ఫీ చెల్లించిన వారి సంఖ్య పెరిగింది. దీనికి కారణం ఎలాగు పరీక్షలు జరగవు పాస్ చేస్తారు అనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది అడ్మిషన్స్ తీసుకున్నారనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 10వ తరగతి పరీక్ష ఫీ చెల్లించిన విద్యార్థులు 63 వేల 581 మంది కాగా.. 47 వేల 392 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫీ చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మొత్తం లక్షా 10 వేల 9 వందల 73 మంది విద్యార్థులు..అందరు పాస్ కానున్నారు. అయితే దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది తెలంగాణ సర్కార్.