రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం లభించింది. బోస్టన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా సదస్సులో ప్రసంగించాలని.. కేటీఆర్‌ను హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఇండియా రైజింగ్ – బిజినెస్, ఎకానమీ, కల్చర్ థీమ్‌తో ఇండియా సదస్సు 21వ ఎడిషన్‌ను హార్వర్డ్ నిర్వహించనుంది. 2024 ఫిబ్రవరి 18వ తేదీన ఈ సదస్సు జరగనుంది. అమెరికాలో విద్యార్థులు నిర్వహించే.. పెద్ద సదస్సు అయిన ఇండియా కాన్ఫరెన్స్‌లో మన దేశానికి సంబంధించిన… వెయ్యి మందికి పైగా విధాన నిపుణులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు.
గతంలో అమర్త్యసేన్, అజీంప్రేమ్‌జీ, అనామికా ఖన్నా వంటి వారితో పాటు.. పలువురు మంత్రులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ నాయకత్వం కీలకపాత్ర పోషించిందని, పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం…. ఆహ్వానంలో పేర్కొంది. ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్… తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు సదస్సు మంచి వేదిక అని అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించవచ్చని తెలిపారు.