బిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆరోపణల పై స్పందించారు మంత్రి నిరంజన్ రెడ్డి. తాను భూములు కబ్జా చేసినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు నిరంజన్ రెడ్డి. ఆయన ఎప్పుడూ వస్తానన్నా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. రఘునందన్ రావు ముందు దుబ్బాకలో ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏది పడితే అది మాట్లాడడం సరికాదని.. తాను కబ్జాలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు.
ఎవరి మెప్పుకోసమో, సంచలనాల కోసమో తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. నాపై ఆరోపణలు చేసిన రఘునందన్ రావు నాకు ఉద్యమ సహచరుడని… ఒక్కప్పుడు కలిసి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. రఘునందన్ రావు పై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు నిరంజన్ రెడ్డి. రఘునందన్ రావు వాళ్ళ జిల్లాను వదిలేసి సంబంధం లేని జిల్లాలో నాపై వ్యతిగతంగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 39ఏళ్ల నుంచి నేను ప్రజలతోనే కలిసి ఉంటున్నాను.. భవిష్యత్ లో ఉంటానని చెప్పుకొచ్చారు. రఘునందన్ రావు కనీస సమాచారం తెలుసుకోకుండా ఎవరో నాలుగు కాగితాలు ఇస్తే ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.