అన్నిచోట్లా తన మార్కు ఉండాలని కేసీఆర్ అనుకున్నారు : మంత్రి పొంగులేటి

-

ఆరు గ్యారంటీలకు తొలి క్యాబినెట్‌లోనే ఆమోదించామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్యారంటీలకు ఆమోదంతోనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని.. మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని వివరించారు.

“రోజుకు 16 గంటలపాటు చిత్తశుద్ధితో పనిచేస్తాం. గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించింది. గత ప్రభుత్వ పరిపాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. రూ.6.71 లక్షల కోట్లు అప్పులు చేసింది. చేసిన అప్పులు దేనికి వాడాలో తెలియకుండా ఖర్చు పెట్టారు. గత సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో గొప్ప భవనం కట్టుకున్నారు. గతంలో వైఎస్ కట్టిన భవనం ఉన్నా ఆయనకు నచ్చలేదు. తాము సంతోషంగా ఉంటే చాలని కేసీఆర్ కుటుంబసభ్యులు అనుకున్నారు. కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్లు ఇద్దామనే ఆలోచన చేయలేదు. సచివాలయం బాగానే ఉన్నా పడగొట్టి కొత్తది కట్టారు. అన్నిచోట్లా తన మార్కు ఉండాలనే గత సీఎం అనుకున్నారు. పేదల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాక మనం ఏం చేసినా తప్పుకాదు.” అని పొంగులేటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news