రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో నేడు మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్ (LRS)కి ఆశించిన స్పందన ఉందని ఆయన తెలిపారు. అయితే గడువు పొడిగించాలనే ఆలోచన ఇప్పటి వరకూ లేదని వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం డబ్బులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ తగిన పరిశీలన అనంతరం ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పారు.
గతంలో 10 శాతం రిజిస్ట్రేషన్ అయిన లే అవుట్లలో.. మిగిలిన 90 శాతం ప్లాట్స్‌కు కూడా ఇప్పుడు ఎల్‌ఆర్ఎస్ చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ సర్వే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. దాదాపు వెయ్యిమంది సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆధార్‌తో లింక్ చేస్తామన్న మంత్రి పొంగులేటి.. గతంలో అన్‌లైన్‌లో నమోదు చేసుకున్న 12 లక్షల సాదాబైనామీలను మాత్రమే భూభారతి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని వెల్లడించారు.