రెవెన్యూ శాఖలో పలువురు అధికారుల యొక్క పని తీరు బాగాలేదని.. మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపింగ్ అధికారులు ఏర్పాటు చేసిన ఇంటరాక్టింగ్ సమావేశంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అధికారులు అందరూ పారదర్శకంగా సేవలు అందించాలి అని సూచించారు. అలాగే అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలోనే ప్రభుత్వం క్లియర్ చేస్తుందని తెలిపారు.
భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ స్థలాలు పేదవారికే ఇవ్వాలని.. వాటిని బడా బాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే సహించమని హెచ్చరించారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను ప్రస్తావించారు మంత్రి పొంగులేటి. ప్రస్తుతం త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని.. దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండు సంవత్సరాలలో ప్రభుత్వ భవనాల్లో పని చేయడం ప్రారంభిస్తాయని తెలిపారు. అలాగే 2014లో 2,746 కోట్ల రూపాలుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్ల రూపాలుకు చేరుకుందని వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.