వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడీ, ఇతర అధికారులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా వృత్తి వ్యవసాయం. నేనున్న వృత్తికి సంబంధిన పోర్ట్ ఫోలియో నే నాకు కేటాయించడం సంతోషకరం.
ముఖ్యమంత్రి ముందు చూపునకు అది నిదర్శనం. వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించడం వల్లే ఆయన నాకు ఈ శాఖను కేటాయించారు. అన్ని రకాల పంటలకు తెలంగాణా నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదు. సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయానికి సమాయత్తం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఉత్పత్తి పెంచి వ్యవసాయశాఖకు మంచి పేరు తేవాలి. వ్యవస్థలో, శాఖాపరంగా ఉన్న లోపాలను సవరించుకొని రైతులకు సంక్షేమానికి అధికారగణం పాటుపడాలి.