రైతుబంధు తరహాలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతుభరోసాకు పటిష్ఠ విధానాలను ప్రభుత్వం రూపొందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆలస్యమైనా.. అర్హులకు మాత్రమే అందేలా రూపకల్పన చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు, రైతు కూలీలకూ రైతుభరోసా అందిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
రైతునేస్తం కార్యక్రమం కింద మంగళవారం 110 గ్రామీణ నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ సందర్భంగా రైతులు పలు సూచనలు చేశారు. సాగు చేసేవారికి, సాగులో ఉన్న భూములకే రైతుభరోసా అందించాలని.. స్థిరాస్తి భూములను మినహాయించాలని కోరారు. వానాకాలం సీజన్‌కు ఈ నెలలోనే సాయం అందించాలని, యాసంగికి నవంబరులో ఇవ్వాలన్నారు. పదెకరాలు ఉన్నవారికీ సాయం అందించాలని.. అలాంటివారిలో ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారని చెప్పారు. 2018 డిసెంబరు 12 కంటే ముందు రుణ బకాయిలున్న వారికీ మాఫీ వర్తింపజేయాలని కొందరు కోరగా.. దీనిపై మరోసారి మాట్లాడతామని మంత్రి చెప్పారు.