నేడు పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండి పడి ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నీళ్లను సమీప గ్రామాల్లోకి పోటెత్తడంతో దాదాపుగా ఏపీ, తెలంగాణలోని 14 గ్రామాలు నీటమునిగాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద పోటెత్తడం.. సమయానికి గేట్లు తెరుచుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుకు మూడు చోట్ల భారీ గండి పడి వరద ఉప్పెనలా ఊళ్లను ముంచేసింది. కుడి కాలువ తూము వద్ద షట్టర్లు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాయి.

ప్రవాహ ధాటికి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల ప్రజలు గుట్టలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా ప్రాణాలు అరచేతపట్టుకుని తలదాచుకున్నారు. విద్యుత్‌, తాగు నీరు లేక ఇబ్బందిపడుతున్నారు. జలవనరుల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించనున్నారు. పెదవాగు ఆనకట్టకు పడిన గండ్లు పరిశీలించనున్నారు. మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. పంట నష్టాన్ని పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news