తెలంగాణ శాసనసమండలి సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలలని అలా అయితేనే పుష్కలంగా నీళ్లుంటాయని అన్నారు. ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని.. అది పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం చేకూరుతుందని.. అందువల్ల ఈ బడ్జెట్‌లో గంధమల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలని కోరారు.
ఈ నేతల ఇద్దరి విజ్ఞప్తులపైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ కొనసాగుతోందని.. గంధమల్లపై ఇప్పటివరకు రూపాయి పనికూడా జరగలేదని తెలిపారు. గంధమల్ల భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని.. స్థానికులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 1.5 టీఎంసీల నీరు నిలిపేలా గంధమల్లలో పనులు ప్రారంభిస్తామని.. 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే మునిగిపోతుందని.. గంధమల్ల గ్రామస్థులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.