వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ఈ రోజు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలో ఈ పాదయాత్రను భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుంటే.. అమెరికా, పాక్ ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాయా.. అని ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల నుంచి ఇలాంటి దుస్థితి రాలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం బాధ కరమని అన్నారు. రాజకీయాలను పక్కన బెట్టి రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.