తెలంగాణలో ఎన్నికల వేడి షురూ అయింది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అధికార బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే.. వేములవాడ ఎమ్మేల్యే చెన్నమనేనని రమేశ్‌బాబు రానున్న ఎన్నికల్లో టికెట్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా తానెప్పుడూ ప్రజల గుండెల్లో ఉన్నానని తెలిపారు.
ఇప్పటికే నాలుగుసార్లు గెలిచానని, పదవిపై తనకు వ్యామోహం లేదని చెన్నమనేని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో భారాస నేత చల్మడ లక్ష్మీ నర్సింహారావు సీరియస్ తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రజలతో మమేకమౌతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి .ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు చేసిన రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారాస చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలో కొంతమంది అక్కడో మాట, ఇక్కడో మాట చెబుతున్నారని.. తనకు అన్నీ తెలుసని పేర్కొన్నారు.