తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏం చేశారో ఎవరికీ తెలియదన్నారు. నిన్నంతా ముఖ్యమంత్రి ఏం చేశారని.. నిద్రపోయిండా..? అని ఎద్దేవా చేశారు.
వరదల నుంచి ప్రజలను కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు జగదీశ్ రెడ్డి. హెలికాప్టర్ గురించి ట్రై చేసినా దొరకలేదని ఓ మంత్రి చెబుతున్నాడని.. హెలికాప్టర్ దొరకలేదంటే ఆయన మంత్రిగా ఫెయిల్ అయినట్లేనన్నారు. దీనికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. ఖమ్మంలో ప్రజలు వరదల్లో చిక్కి గంటలపాటు సహాయం కోసం ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలేదన్నారు.
ఇలాంటి ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా..? అని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధానికి ఫోన్ చేసి ఆర్మీ హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సరైన సమయానికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే ఇంత ప్రాణా నష్టం జరిగేది కాదన్నారు జగదీశ్ రెడ్డి.