బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. 42,652 ఉద్యోగ నియామకాల ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్, ఆ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలి. ఐటీలో 60 ఏళ్లలో కాంగ్రెస్ 3.23 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. పదేళ్లలో కేసీఆర్ ఐటీ రంగంలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్ క్రెడిట్ కాదా? జేఏసీ పేరిట కోదండరామ్ తప్పుడు ప్రచారాలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా పరిశ్రమలు నడిచాయి.” అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.