రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదన్నారు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ. 3000 రూపాయలు ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు గుర్తుపట్టారని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్ ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని.. మహారాష్ట్రలోఅదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని కేటీఆర్ అన్నారు.