స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచి నవ్య మధ్య తలెత్తిన వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత నవ్య, రాజయ్య సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది.
ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మరో నలుగురిపైన ధర్మసాగర్ పోలీసుస్టేషన్‌లో జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య ఈ నెల 21న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు స్పందించాయి.
ఎమ్మెల్యే, సర్పంచి మధ్య వివాదాన్ని కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. వివాదంపై విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. కాగా, రాజయ్యపై చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలని కాజీపేట ఏసీపీ.. సర్పంచి నవ్వను కోరారు. 3 రోజుల్లో సాక్ష్యాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.