కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాదులోని ఆమె నివాసంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పు పట్టారు. రైతులకు షరతులు విధించడం ఏంటి అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని సీరియస్ అయ్యారు.
ఎలాంటి నిబంధనలను విధించకుండా వేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం అన్నారు. అసలు రైతులను వ్యవసాయం చేసుకొని ఇస్తారా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడతారా అని ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. ఏడాది పాలనలోనే ఈ స్థాయిలో ప్రజా దారుణ కోల్పోయిన పార్టీ మరి ఏదీ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి చేతులెత్తేసారని ఎద్దేవ చేశారు.