దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 12న కవిత ఈడీ ఎదుట హాజరు కూడా అయ్యారు. ఈనెల 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పి.. అలా చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత అభ్యర్థనను ఆమె తరఫు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే, ఈనెల 16న కవిత ఈడీ విచారణకు హాజరుకావడంపై ధర్మాసనం స్పందించలేదు. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, వెంటనే విచారణ చేపట్టేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది.