తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. పదోతరగతి ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 93.23, బాలుర ఉత్తీర్ణత శాతం 89.42గా నమోదైనట్లు చెప్పారు. 3,927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత, 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేట్‌వే.
మొత్తం 8,883 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చిందని బుర్రా వెంకటేశం తెలిపారు. 98.71 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో గురుకుల పాఠశాలలు నిలిచాయని చెప్పారు. 99.09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా నిలవగా.. 98.65 శాతంతో రెండో స్థానంలో సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల (98.27) మూడో స్థానంలో నిలిచింది. ఇక 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగున నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. 5,05,813 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.