ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వాగులో దూకిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఇవాళ చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చిన్నారులు మృతి చెందారు. తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా శివంపేట మండలం దంతానపల్లికి చెందిన మమత అనే మహిళకు మాసాయిపేట మండలానికి చెందిన స్వామితో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు తేజస్విని, పూజ అనే కుమార్తెలు ఉన్నారు. ఐదు సంవత్సరాల క్రితం స్వామి చనిపోయాడు. దీంతో మమత ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి స్వగ్రామమైన దంతాలపల్లిలోనే నివాసముంటోంది. అయితే తుప్రాన్ వెంకటరత్నాపూర్ శివారులోని హల్దీ వాగులో ఇవాల తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకింది మమత. గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా చిన్నారులు మునిగిపోయారు. తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.