నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విరుచకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కవితను ఓడించే బాధ్యత తమదని అన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్సీ కవితను ఓడించే బాధ్యత తమదని చెప్పారు. అంకాపూర్ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేశ్‌రెడ్డి బీజేపీలో చేరాక మొదటిసారిగా ఆర్మూర్‌కు రావడంతో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఓటమి నేర్పింది ఇందూరు గడ్డ అని, అందులోనూ ఆర్మూర్ అత్యధిక మెజార్టీ ఇచ్చిందని అర్వింద్ అన్నారు. ఆర్మూర్‌లో నుంచి ఎవరు పోటీ చేసిన మైసమ్మకు మేకపోతును బలిచ్చినట్లే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఇదే డైలాగ్ చెప్పారని, చివరకు ఎవరు బలయ్యారో ప్రజలకు తెలుసని చెప్పారు. బీజేపీ ర్యాలీకి రాకుండా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కొందరిని బెదిరించారని ఆరోపించారు.