ఎన్నికల సమయంలో సమస్యలు ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని చెప్పి.. ఇప్పుడు ఏమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇవాళ గద్వాలలో 23 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించారు. బీజేపీ తరపున ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వశిక్షా అబియాన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని తెలిపారు.
వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసారు. గతంలో ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామన్నోళ్లు.. ఇప్పుడేం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమని తెలిపారు. ఇప్పటికైనా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని.. సాధ్యమైనంత త్వరలో ఉద్యొగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంతవరకు బీజేపీ తరపున ఉద్యోగులకు అండగా ఉంటాం.. పోరాడుతాం.. ప్రశ్నిస్తామని భరోసా ఇచ్చారు ఎంపీ డీ.కే.అరుణ.