సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాసారు. అందులో బ్యూటిఫికేశన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా ? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ? డీపీఆర్ ఉందా ? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్లవిలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా ? సబర్మతి నది ప్రక్షాళనకి 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్ కి 12 ఏళ్లలో 22వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అనేటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి అని అడిగారు.
అలాగే చెరువుల FTL, బఫర్ జోన్ నిర్ధారించకుండ కూల్చివేతలు ఎలా చేస్తారు. పట్టా భూముల్లో ఇళ్ళు కట్టుకున్నవారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు ప్రకటించండి. మీరు చేస్తున్న పనులు హైదరాబాద్ భవిష్యత్తుని, అభివృద్ధిని ప్రశ్నార్థకంలో పడవేస్తున్నాయి. స్టేజీలమీద ప్రకటనలు చేయడం కాకుండా.. నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నా కొట్లాట రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న పేదల ఇళ్ళకోసం. మీరు లక్షన్నర కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా.. అంత బడ్జెట్ మతలబు ఎంటో తేలాల్సిఉంది. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు నా ప్రతిఘటన ఉంటుంది. పదవి ఉన్నా లేకున్నా నేను ప్రజల పక్షాన ఉండేవాన్ని అని తెలంగాణ సమాజానికి తెలుసు అని ఈటల పేర్కొన్నారు.