కేటీఆర్ కామెంట్స్​పై లక్ష్మణ్ రియాక్షన్.. అది అసత్య ప్రచారమంటూ..

-

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో పార్టీలు బీఆర్ఎస్​తో పొత్తు కోసం సంప్రదించాయని.. కానీ తమ బాస్ కేసీఆర్​ మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారని.. కానీ 2018లో బీఆర్ఎస్​తో కలిసి పని చేసేందుకు సిద్ధమని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంకేతాలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా లక్ష్మణ్ స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అసత్యమైనవని లక్ష్మణ్ అన్నారు. దురుద్దేశంతోనే కేటీఆర్ అలా మాట్లాడారని మండిపడ్డారు. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని ధ్వజమెత్తారు. తమ తప్పులను ఎత్తిచూపితే కండ్లమంటతో బట్టగాల్చి మీదేసేలా నిందలు, దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నకిలీ హామీలు, వెకిలి చేష్టలు, అబద్ధపు ప్రచారాలు కేసీఆర్ ఫ్యామిలీకి, బీఆర్ఎస్ నాయకులకు పరిపాటే. బీజేపీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ. బీఆర్ఎస్ అవసరాల కోసం పక్కదారులు తొక్కే పార్టీ. ఎన్నికలొస్తే చాలు.. ఏదో ఒక పార్టీతో లాలూచీపడటం, కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం పొత్తుల డ్రామాలతో ఓట్ల రాజకీయం చేయడమే వాళ్ల నైజం. బీఆర్ఎస్.. వంచన అనే పునాదిపై స్థాపించబడింది. పార్టీ విధివిధానాలతో, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా నడుచుకునే పార్టీ. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను కుటుంబ పాలనతో కబ్జా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి భారాస పార్టీ పొత్తులతోనే కాలం వెల్లదీసింది. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలతో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్​కు.. బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.” అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news