కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీపై బురద జల్లేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. తాము రిజర్వేషన్లకు అనుకూలమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం స్థాయికి తగినట్లు రేవంత్‌రెడ్డి వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు.
“ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం పట్ల తనకెంత ప్రేమ ఉందో ప్రధాని మోదీ చెప్పారు. అంబేడ్కర్, రాజ్యాంగాన్ని అవమానించడం.. కాంగ్రెస్ సంస్కృతి. కాంగ్రెస్ పార్టీకి లౌకికవాదం గురించి మాట్లాడే అర్హత లేదు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ఇచ్చింది. బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెబుతారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేనికి తాకట్టు పెట్టారో రేవంత్‌రెడ్డి చెప్పాలి.” అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.