టాలీవుడ్ హీరో నవదీప్ కి డ్రగ్స్ తో లింక్ ఉందనే అనుమానంతో గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇవాళ నటుడు నవదీప్ ని నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారు. దాదాపు 6 గంటలకు పైగా పలు ప్రశ్నలను సంధించారు. విచారణ పూర్తి అయిన తరువాత బయటికి వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు నవదీప్. ముఖ్యంగా తనకు డ్రగ్స్ తో సంబంధం లేదని బయటపెట్టాడు.
డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకుతాను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ.. పదేళ్ల కిందట పరిచయం. తాను ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్ ని నిర్వహించినందుకు పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే.. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరం అయితే మళ్లీపిలుస్తామని చెప్పారు. ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీతరెడ్డి టీమ్ ఆధ్వర్యంలో బాగా పని చేస్తోందని చెప్పుకొచ్చాడు నవదీప్.
మరోవైపు సెప్టెంబర్ 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడి మల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్స్.. ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్టు తేలింది. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయనే నోటీసులు పంపించి విచారణ చేపట్టారు.