మేడిగడ్డను సందర్శించేందుకు నేడు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీల్లో సమస్యలకు కారణాలను తేల్చేందుకు ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు ఈ కమిటీ పర్యటించనుంది. కుంగడంతోపాటు పియర్స్ దెబ్బతిన్న మేడిగడ్డతోపాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి.. నీటిపారుదలశాఖ అధికారులు, నిర్మాణంలో పాలుపంచుకొన్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించనుంది.
ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని నిపుణుల కమిటీ కన్వీనర్ తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరారు. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో యు.సి.విద్యార్థి, ఎస్.హెచ్.ఆర్.పాటిల్, శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్ సింగ్, అమితాబ్ మీనా సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. మొదటగా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని ఈ కమిటీ సభ్యులు నీటిపారుదలశాఖ అధికారులతో చర్చిస్తారు. రాత్రికి మేడిగడ్డ వెళ్లి అక్కడే బస చేస్తారు. 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి 9న మళ్లీ అధికారులు, ఇంజినీర్లతో చర్చించి తిరిగి వెళ్తారు.