మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పరిశీలనకు ఏర్పాటు చేసిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ రెండో సారి రాష్ట్రానికి రానుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశం కానుంది. మూడు ఆనకట్టలకు సంబంధించిన ప్రణాళిక, డీపీఆర్ తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, తదితరాలపై ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థలు, నిపుణులతో కమిటీ చర్చించనున్నట్లు సమాచారం.
గత పర్యటనలో కొన్ని విభాగాల ఇంజినీర్లతో సమావేశమైన కమిటీ వాటికి కొనసాగింపుగా ఈ దఫా భేటీ నిర్వహించనుంది. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, సంస్థల ప్రతినిధులు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖకు సూచించింది. రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబరేటరీస్ లో ఉన్న మూడు ఆనకట్టల మోడల్స్ పని తీరునూ పరిశీలించనున్నట్లు ఎన్డీఎస్ఏ కమిటీ తెలిపింది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఆనకట్టలను పర్యటించి పలు కీలక వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.