పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించింది. దీంతో నిర్మాణ పనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు కష్టాలు తీరినట్లేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయని వెల్లడించారు.
ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యామని తెలిపారు. మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తాం .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ గారు మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథం చేశారని గుర్తము చేశారు. ఆ కల త్వరలోనే నెరవేరబోతున్నదన్నారు నిరంజన్ రెడ్డి.