తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ ప్రచారం నిర్వహించారు. ఇక ఇవాళ రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్లో ప్రచారం నిర్వహించిన నిర్మలా సీతారామన్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేదని.. అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. వేల కోట్ల పెట్టుబడి పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీ పాలనలోనూ.. నిధులు సద్వినియోగ పరుచుకోవడంలోనూ విఫలమైందని విమర్శించారు.