నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు.. వేల్పూర్‌లో గరిష్ఠంగా 46.3 సె.మీ. వర్షపాతం

-

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఏకధాటిగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ వానలు బీభత్సం సృష్టించాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు 46.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.39 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో 46.3 సెం.మీ, ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లో 33.1, భీమ్‌గల్‌లో 26.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తాజా వర్షానికి జిల్లాలో మొత్తం 7 చెరువులు దెబ్బతిన్నాయి. వేల్పూర్‌లోని మర్సుకుంట చెరువు, కాడి చెరువులతో పాటు పచ్చలనడ్కుడ, జానకంపేట, పడగల్‌ నవాబ్‌ చెరువుల కట్టలు తెగిపోయాయి. పడగల్‌ చెరువు తెగటంతో అక్కడి రోడ్డు కూడా భారీగా దెబ్బతింది. వేల్పూర్‌లో సోమవారం అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలను పంచాయతీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version