బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వామపక్షాలు కోరుతున్న స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో వాటితో ఎన్నికల అవగాహనకు అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో ఈ పార్టీల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు కంగుతిన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. చెరి 3 అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టిన వామపక్షాలు.. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని అడిగాయి. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని బీఆర్ఎస్ పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు.