రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకానికి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పది యూనివర్సిటీలకు వీసీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ- హెచ్, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలుగు, మహాత్మా గాంధీ, అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం మే 22వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వీసీల నియామకం కోసం అర్హులు దరఖాస్తులు సమర్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ బయోడేటాతో కూడిన దరఖాస్తు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హతలు, విధివిధానాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంటాయని తెలిపారు. మరోవైపు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛైర్ పర్సన్, ఆరుగురు సభ్యుల నియామకం కోసం మహిళ, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉంటారని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.