తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గాంధీ భవన్ లో రోజుకో నియోజకవర్గానికి సంబంధించిన లొల్లి చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి లొల్లి జరుగుతోంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి తీరుకి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద నిరసన చేపట్టారు.
ముఖ్యంగా దేవరుప్పుల మoడల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గాంధీ భవన్ ముందు నిరసనకు దిగారు నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు.పేరుకే ఎమ్మెల్యే యశిస్విని రెడ్డి అయినా పెత్తనం మాత్రం అత్త ఝాన్సీ రెడ్డి చేస్తుంది అంటున్నారు కార్యకర్తలు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న వారికి ప్రియారిటి ఇవ్వకుండా నిన్న మొన్న వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రియారిటి ఇస్తుంది అని పేర్కొంటున్నారు కార్యకర్తలు. దేశ పౌరసత్వం లేనప్పటికీ, పార్టీలో ఎలాంటి పదవి లేనప్పటికీ పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ.. బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన బెట్టుకొని సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా ఝాన్సీ రెడ్డి వ్యవహారం ఉందని పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ వ్యవహారం పై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.