తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం అన్ని పంచాయతీల వారిగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గ్రామపంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ లలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శించారు. ఓటర్ల ముసాయిదా జాబితా పై ఈనెల 14 నుంచి 21 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు తెలిపింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.
సెప్టెంబర్ 26న వాటిని పరిష్కరించనున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాల సవరణ పై ఈనెల 18న జిల్లా స్థాయిలో, 19న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈనెల 28న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లో అన్నీ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. ఆ తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. చివరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు.