తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. తన ఇజం.. హ్యూమనిజం అని పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు తనకు స్ఫూర్తి అని తెలిపారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచామన్న పవన్.. ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం జనసేన అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడింది. వాటి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కష్టపడ్డాయి. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాను. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ విస్త్రతంగా పర్యటిస్తాను. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుంది. మోదీ ప్రధాని కాక ముందే మద్దతు తెలిపాను. తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశం అంతా ఉంటే అవినీతి ఎప్పుడో పారిపోయి ఉండేది. తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయి అని అన్నుకున్నాను. కేసీఆర్, కేటీఆర్, రేవంత్‌రెడ్డి, వీహెచ్‌తో పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులతో పరిచయం ఉన్నప్పటికి మోదీ, బీజేపీకి నా మద్దతు. స్నేహం వేరు.. రాజకీయాలు వేరు. అని పవన్ కల్యాణ్ అన్నారు.