కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడగిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ప్రజల అవసరాల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇచ్చింది. వైద్య, వ్యవసాయ రంగాలతో పాటు పలు అత్యవసర సేవలకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
అయితే ఇందులో లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మాత్రం ప్రభుత్వం మినహాయింపు ఇవ్వలేదు. కేవలం జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోలు బంకులకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఈ కారణంగా లాక్‌డౌన్ సడలింపు సమయంలో పెట్రోల్ బంకుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ళు చేస్తున్న సమయం కావడంతో వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు, ధాన్యం సేకరించి మిల్లులకు రవాణ చేసే వాహనాలు సహా ఇతర వ్యవసాయ సంబంధిత వాహనాలు ముందస్తుగా డిజీల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. పలు మార్లు డిజీల్ అయిపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోపెట్రోల్ బంకులు సాధారణ సమయాల్లో తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.