తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా ఓవైపు నగదు, బంగారం, మద్యంపై.. ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టిన ఈసీ.. మరోవైపు సోషల్ మీడియాపైనా ఓ కన్నేసింది. ఈ నేపథ్యంలోనే వదంతులు వైరల్ చేసే సోషల్ మీడియా యూజర్లు, యూట్యూబర్లపై నిఘా పెట్టింది. నెట్టింట ఇష్టారీతిన పోస్టులు పెడుతూ ఘర్షణలకు దారి తీస్తూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ఫోకస్ పెట్టింది.
ఇటీవల ఒక ప్రజాప్రతినిధి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అనంతరం ఆయన మరణించాడంటూ నెట్టింట పుకార్లకు తెర లేపారు. మరో కేసులో ఒక వర్గానికి చెందిన దైవాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి.. ఇరువర్గాలు గొడవపడేలా చేశారు. చేతిలో లోగో, మైక్, సెల్‌ఫోన్లతో ఇష్టానుసారం వీడియోలు తీసి క్షణాల్లో వైరల్ చేసి గొడవలయ్యేలా రెచ్చగొడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారికి కుటుంబం సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
మరోవైపు మీమ్స్ పేరుతో రాజకీయ నేతలపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. నవ్విస్తున్నామనే ఉద్దేశంతో కొందరు ఇష్టానుసారం వీడియోలు రూపొందిస్తున్నారు. ఇటీవల అధికార, ప్రతిపక్షాలకు చెందిన కొందరి పాతవీడియోలపై రూపొందించిన మీమ్స్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 30 మందికి నోటీసులు జారీచేశారు.