ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు రావడం కష్టమవుతోంది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఓ చల్లని కబురు చెప్పింది. అదేంటంటే..?
రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న చెప్పారు.
15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 16వ తేదీ మధ్యాహ్నం నుంచి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందని ప్రకటించింది. 17వ తేదీన నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్ని చోట్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.