తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన పుట్టిన రోజునే ఏకంగా 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీలపై మంత్రికి మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పార్క్ పాలనను ప్రారంభించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ వంటి శాఖల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు.
ఎవ్వరూ ఊహించని విధంగా స్థానాలకు వెళ్లారు. కొందరికేమో వారు కోరుకున్న సీట్లు రాలేదు. మరికొందరికీ వారు ఆశించని విధంగా ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు బదిలీ కావడం గమనార్హం. వెయిటింగ్ లోని పది మంది ఆర్డీవోలకు కూడా పోస్టింగ్స్ లభించాయి. డిప్యూటీ కలెక్టర్లు ఎల్.రమేష్, ఎన్. ఆనంద్ కుమార్, హన్మనాయక్ లకు ఎళాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.