కొత్త విద్యాసంవత్సరం (2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఏపీ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలోని 15 శాతం స్థానికేతర (నాన్‌లోకల్) సీట్లకు పోటీ పడి దక్కించుకోవచ్చని చెప్పారు. జూన్ 2వ తేదీలోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వెలువరించినందువల్ల ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.
ఏపీ విద్యార్థులు ప్రధానంగా బీటెక్ సీట్లకే పోటీపడుతుంటారు. ఆయా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఫిబ్రవరి, మార్చిలలో జారీ అయ్యాయి. అయితే ప్రవేశాల నోటిఫికేషన్(కౌన్సెలింగ్ షెడ్యూలు) జూన్ 2వ తేదీ తర్వాత జారీ చేస్తే ఏపీ పునర్విభజన చట్టం వర్తించదని, కన్వీనర్ కోటాలోని 100 శాతం సీట్లూ తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకే దక్కుతాయని కొద్ది నెలల క్రితం వరకు భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎప్‌సెట్ కన్వీనర్ కోటాలో 20 శాతం సీట్లు మిగిలిపోతున్నాయని భావించిన ప్రభుత్వం.. ఈసారికి యథావిధిగా స్థానికేతర కోటా వర్తింపజేస్తామని స్పష్టంచేసింది.