ఐదో విడతలో పోటీ చేసే ప్రముఖులు వీరే

-

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం రోజున ఓటింగ్ జరగనుంది. ఈ దశ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్​నాథ్​ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూశ్ గోయల్, ఎల్​జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్​బరేలీ నుంచి రాహుల్ బరిలో దిగగా, లఖ్​నవూ స్థానంలో రాజ్​నాథ్ సింగ్, అమేఠీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. కాగా, మే 20న దేశవ్యాప్తంగా ఉన్న 49 స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనుంది.

ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. లఖ్​నవూ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశపడుతున్నారు.2019లో అమేఠీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించిన బీజేపీ మహిళ నేత స్మృతి ఇరానీ మరోసారి అదే స్థానం నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ కిశోరీ లాల్​ను స్మృతిపై పోటీకి దింపింది.

ముంబయి నార్త్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పోటీ చేస్తున్నారు. ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానం నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను బీజేపీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించింది. కైసర్‌ గంజ్ లోక్‌సభ స్థానం నుంచి రెజ్లర్ల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు టికెట్ నిరాకరించి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను బరిలో దింపింది కమలం పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news