దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన వెనక ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. దాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండిస్తూ.. కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపించదని స్పష్టం చేశారు. ఇక తాజాగా ఈ ఘటనపై ఆ ప్రాంత ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ఈ ఘటనతో తనకు, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రభాకర్ రెడ్డిపై దాడికి తానే కారణమని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అందులో వాస్తవం లేదని రఘునందన్ రావు చెప్పారు. అనవసరంగా కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్లు తమ పార్టీ కార్యకర్తలైతే స్వయంగా తానే తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తానని వాగ్దానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి, తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. నెట్టింట వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి.. అసలు విషయం బయటపెట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.